Rajsri 143's Album: Wall Photos

Photo 309 of 316 in Wall Photos

నేను అమ్మనే నాన్నా...
ఆవేదన తీరిన నేటి రోజుకి
నీకు మిగిలున్న అమ్మని

కడుపులో బిడ్డకోసం కడుపారా తినాలో
తప్పిపోయిన నీకోసం సొమ్మసిల్లేలా ఏడవాలో
తోచలేదురా కన్నా!!

గుక్కపట్టిన నరాలన్నీ కోసుకుంటున్న భావనో వైపు
కడుపులోని నీ రక్తబంధం కదులుతున్న భయమో వైపు
నిలువనీయలేదురా చిన్నా !!

పాలుగారే నీ చిరునవ్వుల మోమే నా మనోఫలకం పై
రేపో మాపో బయటపడాలనుకునే పిండమే నా ఎత్తు పొట్ట లో
ఏమి చేయనురా తండ్రీ!!

నిద్రలేని రాత్రుల జాగారాలతో మూడు రోజులూ
మూడు యుగాలయ్యే
నిద్రించని శరీరం శుష్కిస్తే నీ తోడబుట్టేటోరి ప్రాణం ఏమగునో అనే దిగులాయే
కన్నీటి వరద ఆగలేదురా బంగారూ!!

ఇప్పుడు నువ్వొచ్చేశావ్...
నా నవ్వుల్ని తిరిగి నా చెంతకు చేరుస్తూ
నా కడుపునున్న నీ జతను పదిలపరుస్తూ

ఇప్పుడు నువ్వొచ్చేశావ్...
నా కంటి నీటి ధారల్ని ఆపేస్తూ....
నా కన్నపేగు బంధాలను కలిపేస్తూ....

నిన్నెత్తుకెళ్లిన వాళ్ళకు ఒకటి చెప్పాలని ఉందిరా...

అమ్మ గుండెకు మంటను ఇవ్వొద్దని...
అమ్మ ప్రేమను అలుసుగా చూడొద్దని...
అమ్మ బాధను అర్థం చేసుకొమ్మని...
అమ్మల కంట కన్నీటికి కారణం కావొద్దని...

ఎందుకిలా నా రగులుతున్న గుండెని అదిమిపట్టుకుంటూ
సుతిమెత్తగా చెబుతున్నానో తెలుసా..?

వారిని కన్నదీ ఓ అమ్మే కదా!!
అందుకని...
నేను వారిని శపిస్తే
ఆ అమ్మకి ఎక్కడ నొప్పి తగులుతుందో అని
ఆ అమ్మ బాధకి నేను కారణం కాకూడదని

అంతేరా నాన్నా !!!

(తప్పిపోయి తల్లి చెంత చేరిన చిన్నారి జషిత్ కన్నతల్లి ఆవేదన కు ప్రతిరూపంగా ఓ చిన్న కవనం) #Mother