Rajsri 143's Album: Wall Photos

Photo 2 of 316 in Wall Photos

చీర లోనే వుంది పవిత్రత…. చీరతోనే భారతీయ మగువకి పరిపూర్ణత.............
ప్రపంచం పోకడ ఎంతో వేగంగా మారుతున్నా మన భారతీయ సంప్రదాయ విలువలు చాలావరకు ఇంకా మారకుండా అలాగే సజీవంగా వున్నాయి. భారతీయ సంస్కృతికి ప్రత్యేకత చీర. నిండైన ఆడతనానికి వన్నె తెచ్చేది చీర. పదహారణాల ఆడపిల్ల పరువానికి పరువే చీర. ఎన్ని రకాల దుస్తులు వచ్చినా, వస్త్రాలంకారాన్ని ఎన్ని ఫ్యాషన్ పోకడలు చుట్టుముట్టినా పదహారణాల తెలుగింటి ఆడపడుచు మార్కు మాత్రం చీరదే.

చీరలు తరతరాల భారతీయ దుస్తులలో భాగాలు. ఇంటికొచ్చిన ఆడపడుచుకి మనసారా చీర పెట్టినప్పుడు కలిగే తృప్తిని దేనితో కొలవగలం? ఆడపిల్ల రూపానికి చీరని మించి మరే వస్త్రం లాలిత్యాన్ని ఆపాదించగలదు? ఆడవాళ్ళకి చీర తెచ్చే హుందాతనాన్ని మరింకేది తీసుకురాగలదు? చీరలో అంతటి సొగసు, నిండుదనం వున్నాయి కాబట్టే ఇప్పటికీ తెలుగింటిలో చీరకు అంతటి ఉన్నత స్థానం.

సాహిత్యంలో కూడా భారతీయ దుస్తులలో ప్రామాణికమైన చీరల గురించి విశేషంగా ప్రస్తావన జరిగింది. తెలుగు సినిమా పాటల్లో కూడా చీరకు విశిష్ట స్థానం కలిపించారు మన కవులు. మొన్న ఖాళీ సమయం దొరికితే చీరల మీద కొన్నిపాటలు వినడం జరిగింది. అందులోని కవుల వర్ణన ఎంతో నచ్చి ఇక చీర మీద బ్లాగడం తప్పదేమో అనిపించింది. భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటి, మన జాతీయ జెండాకు సమానంగా నిలిచిన చీర గురించి, వాటిపై రాయబదిన పాటల గురించి మీకు గుర్తు చేద్దాం అన్న ఆలోచనతో ఈ టపా రాస్తున్నాను.

చీరల్లో రకరకాల చీరలు వున్నా, తెలుగింటిలో పట్టుచీరదే మొదటి స్థానం. పెళ్ళిళ్ళలో, వేడుకల్లో ఆడవాళ్ళు పట్టుచీరల్లో కళకళలాడుతూ కలయ తిరుగుతుంటే కన్నుల పండుగలా వుంటుంది. అందుకే అన్నారేమో “నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా, ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” అని. కాదనగలరా? చీరనే కాదు, మన తెలుగు కవులు చీర కట్టుని కూడా అందంగా వర్ణించారు. మీరే చూడండి……
“మడి కట్టుతో నువ్వు పూజ చేస్తే గుడి వదిలి దిగివచ్చును దేవుడు,
ఎంకి కట్టుతో నువ్వు పొలం పనులు చేస్తే సిరిలక్ష్మిని కురిపించును పంటలు.,
జారు కట్టుతో పడకటింట చేరితే గుండె జారి చూస్తాడు పురుషుడూ,
నిండు కట్టుతో నువ్వు నడిచి వెళ్తుంటే దండాలే పెడతారు అందరూ….“
ఆ ఊహ ఎంత బాగుందో కదూ? పాట వింటుంటే ఆ చీర కట్లతో స్త్రీలు కళ్ళముందు కదలాడతారు. పసిపాపలా నిదురపోయినప్పుడు ఊయలగా మారి, అన్నం తిన్న తదుపరి మన మూతిని తుడిచి, కన్నీరై వున్నప్పుడు మన చెంపని తడిమి – ఆ చీర కొంగులోనే కన్నతల్లి ప్రేమని గుర్తుకుతెస్తుంది (చంద్ర బోస్ గారు రాసిన మంచి పాటల్లో ఇది ఒకటి).

వెన్నెలే ఓ కన్నెపిల్లైతే ఆమెను కప్పేసే పల్చటి మేఘాలే మబ్బు చీరలు. సప్త వర్ణాలే ఏడు చీరలయితే ప్రతీ పడుచు ఓ హరివిల్లు. అందుకే అన్నాడేమో మరో కవి “వన్నె వన్నె చీరల్లోనా నీ ఒళ్ళే హరివిల్లు” అని.
“చుట్టూ చెంగావి చీర చుట్టాలే చిలకమ్మా
బొట్టూ కాటుక పెట్టి, నే కట్టే పాటని చుట్టి,
ఆశపడే కళ్ళల్లోనా ఊసులాడు వెన్నెల బొమ్మా“
ఎర్ర రంగు చీరలో సందెపొద్దులా , పచ్చరంగు చీరలో పంట చేను సిరిలా ఆ పడుచు కనిపించిందేమో! నేరేడు పళ్ళరంగులో జీరాడే కుచ్చిళ్ళుతో, వంగపండు రంగులో పొంగుతున్న సొగసులతో కవి హృదయాన్ని తాకి వుంటుంది ఆ పడతి. అందుకే ఆ పాట ఇప్పటికీ మనసును అనుభూతులతో నింపుతుంది.

ఇదివరకటితో పోలిస్తే చీరల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. మైసూరు సిల్క్, కంచిపట్టు, గద్వాల, బెనారస్ ఇలాచెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు. ఎన్ని ట్రెండ్స్ మారినా, ఎన్ని డిజైన్స్ వచ్చినా ఆడవాళ్ళకి అన్ని చీరలూ నచ్చుతాయి తన భర్త తెచ్చిన చీర తప్ప. భర్త ఎన్ని చీరలు తెచ్చినా ” మన పక్కింటావిడ చీర చూసారూ-ఎంత బాగుందో” అంటూ పొరుగింటి పుల్లకూర వాసన చూపిస్తూ వుంటారు. అందుకే ఒక కవి (ఈయనకు తప్పకుండా పెళ్లి అయ్యి వుంటుంది) తనే ఒక చీరను(పాటగా) తయారు చేసాడు. ఆ చీర విశేషాలు చూద్దామా?
“ సరికొత్త చీర ఊహించినాను,
సరదాల సరిగంచు నేయించినాను.,
మనసూ మమతా పడుగూ పేటా చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత, నా వన్నెల రాశికీ సిరిజోతా“
ముచ్చట గొలిపే మొగలిపొత్తులను, అభిమానం గల ఆడపిల్ల అలకా కులుకులనూ కలబోసి చీరగా మలిచి కొంగుకు చెంగున ముడివేసాడు ఆ కవి. పెళ్లి పుస్తకం లోని ఈ మధురమైన పాటను ప్రస్తుతించకుండా చీరను గురించి చెప్పడంచాలా కష్టం.

పరికిణీలలోని పడుచుపిల్ల అందానికి చీరలోని మగువ అందానికీ తేడా వుంది. మొదటిది హుషారయిన వయ్యారమయితే రెండోది హుందా అయినా సింగారం. చీర మీద నాకెంతో ఇష్టమైన యండమూరి వారు రాసిన ఈ చిన్నికవిత కూడా చీరల మీద బ్లాగడానికి కారణం.
“వెన్నెల్లో కూర్చుని భావాన్ని నేస్తే–
పాట చీర తయారయింది.
జరీ పల్లవికి చరణం అంచు- రంగు పొగమంచు.
పై పైకి రాకు సూర్యుడా! పోద్దంటే మాకు చేదురా!
కంటి చూపు చీర కట్టాలి వంటిని
కంచిపట్టు చీర జారాలి నేలని.
వేళ్లు నేసే నేతకి- కుచ్చిళ్ళు పాడే పల్లవి.
తుఫాను రేగే ముందర- ముస్తాబులేల దండగ?“

సింగారమనే దారంతో చేసి, ఆనందమనే రంగులను అద్ది, మమకారమనే మగ్గం పై నేసిన చీరకు తిరుగేముంది? చీర పవిత్రతని సూచిస్తుంది, మన సాంప్రదాయం