Rajsri 143's Album: Wall Photos

Photo 273 of 316 in Wall Photos

ఏ మనిషిని కదిపినా
ఒక్క మాటా పుప్పొడిలా రాలదు
ఒక చిరునవ్వూ పూయదు
బహుశా
ఎవరి గాయాలకు
వారే కట్టుకట్టుకుంటూ
అగాధంలోకి జారిపోతున్న
తమని తాము
నిటారుగా నిలబెట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది
అందరూ
ఆకులు రాల్చేసుకున్న చెట్లలా
మోడులలా అగుపిస్తూ
శిశిరాలను వెల్లువెత్తిస్తున్నారు
చీకట్లను ఇటుకలుగా పేర్చుకుని
నిర్మించుకున్న ఇళ్ళలో
మౌనపు దారపుండలతో
ఒంటరితనాన్ని నేస్తున్నారు
కన్నీటినదుల వరదలొచ్చి
ముంచేస్తుంటే
రాత్రులలో వెలుతురు కిరణాన్ని
వెతుక్కుంటూ
రెక్కలు తెగిన సీతాకోకలలా
ఊపిరాడక కొట్టుకుంటున్నారు
ఒకవైపు నైరాశ్యం
శ్వాసకు ఉరేస్తుంటే
ఇక వారు వసంతాన్ని
ఎలా కలగంటారు
సమూహాలుగా చరించాల్సిన వారందరూ
గాజుతెరలను ముద్దాడుతూ
ఎండమావులలోంచి
నీటిచుక్కను తోడడానికి
ప్రయాసపడుతూ
పక్కనున్న చల్లని చెలమలను
నిర్లక్ష్యంగా పూడ్చేస్తుంటే
ఇక ఎవరికి ఎవరు మిగిలుంటారు
ఆఖరున వారు
చివర క్షణాల కొసల వెంట
పారాడుతూ పోయి
మట్టి రేణువులతో స్నానించి
పుడమి లోతులలోకి
తాము కోల్పోయిన దాన్ని వెతుక్కుంటూ నడచిపోతారు
కొన్నాళ్ళకు
మనిషితనమనే
పదం తాలూకు
నిర్వచనాన్నే
సునాయాసంగా మరచిపోతారు