Rajsri 143's Album: Wall Photos

Photo 305 of 316 in Wall Photos

ఒక సందర్భంలో గ్రామ తగాదాలు తీవ్రస్థాయికి చేరుకొని పోట్లాటలు జరిగిన కారణంగా పోలీసులు రఘు అనే సాయి భక్తునితో సహా ఇరవై మందిని అరెస్ట్ చేసారు. వారందరిపై సమగ్ర విచారణ జరిపి జైలు శిక్ష విధించారు.నిజానికి ఆ తగువుతో రఘుకు ఏ మాత్రం సంబంధం లెదు. కాని, కొంతమంది విరోధులు ఇచ్చిన సాక్ష్యాలనుగుణంగా అతనికి శిక్ష పడింది. రఘు తాను నిరపరాధినని, కనుక విడిచి పెట్టవలసిందిగా కోర్టుకు అప్పీలు చేసుకొని ఆ ప్రతిని చందోర్కర్, దీక్షిత్ లకు పంపాడు. వారు ఆ ప్రతిని పరిశీలించి, ఈ కేసులో సాక్ష్యాధారాలు బలంగా వున్నందున రఘుకు శిక్ష ఖరారు కాక తప్పదని పెదవి విరిచారు.రఘు ఆ ప్రతిని శ్రీ సాయికి కూడా పంపి తనను కాపాడవల్సిందిగా కన్నీరు మున్నీరుగా ప్రార్ధించాడు. శ్రీ సాయినాధులు కరుణించి తన భక్తుడైన న్యాయవాది ధుమాల్ ను పిలిపించి రఘు వ్రాసుకున్న అప్పీల్ మెమోను అందించి ఆశీర్వదించారు. కేసును పరిశీలించిన ధుమాల్ కు తాను ఈ కేసు గెలుస్తానన్న ఆశ లవలేశమైనా లేకున్నా కేవలం శ్రీసాయి ఆజ్ఞానుసారం అహ్మద్ నగర్ వెళ్ళి మెజిస్ట్రేట్ ను కలిసి తన వాదనను పిలిపించాడు.

ఆ రోజు రాత్రి రఘుకు కలలో సాయి దర్శనం ఇచ్చి “ నిన్ను నేను కరుణించాను.నీపై కేసు కొట్టివేయబడుతుంది. రేపు నువ్వు విడుదల అవుతావు” అని చెప్పారు.ఆ మర్నాడు మెజిస్ట్రేట్ రఘు యొక్క అప్పీల్ మెమోను, ఇతర రికార్డులను పరిశీలించి, ఏ విధమైన విచారణ జరపకుండానే కేవలం గ్రామం లో విరోధాల కారణంగా రఘుపై అక్రమంగా కేసును బనాయించి నట్లు నిర్ధారించి, రఘును నిర్ధోషిగా తీర్పు ఇచ్చి విడుదల చేసారు. అప్పట్లో ఈ కేసు దేశమంతటా సంచలనం సృష్టించింది. ఆస్తికులు,నాస్తికులు ఒకరేమిటి అందరూ న్యాయమూర్తి తీర్పు విని ముక్కున వేలేసుకున్నారు.కాని అసలైన న్యాయమూర్తి శ్రీ సాయినాధులే ! ఆయన కృప వలనే తనపై అన్యాయంగా బనాయించిన కేసు కొట్టివేయబడిందని తెలుసుకున్న రఘు వెంటనే శిరిడీ వెళ్ళి సాయికి శత సహస్రకోటి వందనాలను అర్పించుకున్నాడు. ఫీజు క్రింద రఘు ధుమాల్ కు యాభై రూపాయలను చెల్లించుకోగా , ధుమాల్ వద్ద నుండి శ్రీ సాయి ఆ పైకమంతటినీ దక్షిణగా తీసేసుకొని రఘు విడుదల అయ్యింది తన అనుగ్రహం వలనేనని సూచించారు.శ్రీ సాయిని నమ్ముకుంటే చాలు ! ఎటువంటి విపత్కర పరిస్థితుల నుండైనా అవలీలగా రక్షిస్తారన్న నగ్న సత్యం సాయి భక్తులకు మరొకసారి బోధపడింది.

ఆ తర్వాత శ్రీ సాయి ధుమాల్ ను యాభై రూపాయలను దక్షిణ అడిగారు. తన వద్ద తెచ్చుకున్న పైకం అంతా అయిపోవడం వలన ధుమాల్ చిన్నబుచ్చుకున్నాడు. అప్పుడు శ్రీ సాయి ధుమాల్ ను హరి వినాయక్ సాఠే వద్దకు వెళ్ళి ఆ పైకం తీసుకోమని సూచించారు.ధుమాల్ సాఠే వద్ద నుండి డబ్బు తీసుకొని శ్రీ సాయికి దక్షిణ సమర్పించాడు.అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఆరు నెలల కిందట తనకు పెన్షన్ యాభై రూపాయలు పెంచమని సాఠే ప్రభుత్వానికి అప్లికాషన్ పెట్టుకున్నాడు.కాళ్ళు అరిగేలా ఆఫీసు చుట్టూ తిరిగినా అధికారులు కిమ్మనలేదు. విసిగి వేసారి, శ్రీ సాయిపై బాధ్యతను వుంచి సాఠే మిన్నకుండిపోయాడు. ధుమాల్ కు యాభై రూపాయలను అప్పు ఇచ్చిన తర్వాత మర్నాడే పెన్షన్ పెంచుతునట్లు అధికారులు సాఠేకు కబురు పంపించారు. సాఠే కుటుంబ సభ్యుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. శ్రీ సాయినాధుని దయ, కరుణా కటాక్షాలు వుంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదని మరొక్క సారి విశ్వసించారు. సాయికి దక్షిణ ఇచ్చే ప్రతీ పైసాకు వంద రెట్లు తిరిగి మనకే లభిస్తుంది.

సర్వం శ్రీ శిరిడీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు..